Skip to main content

దైవం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటి? రెండింటికి అన్వయం ఏమిటి?

అంతా శివ మయం, శివుడు తలచనిదే చీమైనా కుట్టదు ఇలాంటివి వింటూ వుంటాము, అసలు దైవం అంటే ఏమిటి? నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా కనిపిస్తాడు? ఇలా మనకి చాలా ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. 


మనలో ఉండే నాస్తికులు, ఆస్తికులకు అయితే దీని మీద యుద్దాలే జరుగుతాయి. ఇక్కడ దేవుడుని చూపించలేము కాని సహేతుకమైన వివరణకి ప్రయత్నిద్దాం.


దేవుడు చేసినట్టు చెప్పబడే ఎన్నో గొప్ప కార్యాలకు నిలువెత్తు సాక్షాలు నిజ జీవితంలో దొరుకుతున్నాయి (సముద్రం క్రింద ఉన్న ద్వాపర మహా నగరం, రామసేతు తదితరములు) కావున దేవుడు ఉన్నాడు అన్నది సత్యం. అయన మహిమలు ఎన్నో నిజ జీవితంలో చూస్తున్నాం కనుక ఆయనే నిజం అంటారు మన ఆస్తికులు. మీరు ఏదైనా అద్బుతాన్ని చూపించండి దాని వెనుక దాగి ఉన్న సైన్సు మేము చెబుతాం అంతే కాని అది దేవుడు కాదు అంటారు మన నాస్తికులు.


సరే నిజంగా ఇది మొత్తం సైన్సు అయ్యి ఉంటే ఇప్పటికీ మనం కనిపెట్టలేని ఎన్నో అద్బుతాలు ఉండిపోయాయి. అసలు ఎలా ఈ జీవరాసి ఉనికి మొదలు అయ్యింది. మొట్టమొదటి మానవుడు ఎలా పుట్టాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సైన్సు నందు ఉహజనిత సిద్దాంతాలు ఉన్నాయే కాని, ఇలాగే జరిగింది అన్న నిరూపణ లేదు, దాన్ని ఆస్తికులు దైవం అంటారు నాస్తికులు ఇంకా మనం తెలుసుకోవలసిన జ్ఞానం అంటారు. వీరు ఇరువరికి మధ్యే మార్గముగా అది తెలియనంత కాలం ఈ సృష్టిని నడిపే ఒక అద్బుతం లాగానే చూద్దాం. 


రామాయణం, మహాభాగవతం వంటి గొప్ప గొప్ప గ్రంధాలలో దేవుడి చరిత్ర స్వయంగా లిఖించబడింది అని ఆస్తికులు, సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి మనుషులకు భయం, భక్తి అనే రెండు ఉండాలి మరియు వాళ్ళకి మార్గదర్శకంగా ఒక దిక్సూచి ఉండాలి కాబట్టి మన పూర్వీకులే అప్పటికి వారికి తెలిసిన కొన్ని అద్బుతాలకి, అభూత కల్పనలు కలిపి పైవిధముగా గ్రంధాలు రాసి ఉంటారు అంటారు నాస్తికులు, సరే పైన రెండు విషయాలలో కనిపించే ఒక సారూప్యం ఏమిటి? ఆ గ్రంధాలు రెండు కూడా మానవ మనుగడకి మంచి మార్గం చూపించడానికే అని కదా? మరి అది దేవుడే ఇస్తే ఏమి? మనమే రాస్తే ఏమి? మంచి ఏదైనా ఆచరించోచ్చు కదా?


కాబట్టి ఆస్తికులు దైవం అని,నాస్తికులు అద్బుతం అని అనుకుంటూనే ముందుకు వెళ్దాం.


మనలో చాలా మంది ఎదో అద్బుతం జరుగుద్ది, మనం కష్టపడక పోయినా మనకి రాసిపెట్టి ఉంటే జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు, ఇంకా చెప్పాలి అంటే మనం చేసే దానికి కూడా ఆ దేవుడినో లేక ఇంకెవరినో నిందిస్తూ వెళ్తుంటారు. "కర్త నువ్వు అయినప్పుడు క్రియ నీదైనపుడు దాని వలన వచ్చే కర్మకి నువ్వే బాధ్యుడివి" దానికి వేరొకరిని నిందించడం మన అవివేకం. భగవత్గీత చదివినా, బైబిల్ చదివిన, ఖురాన్ చదివినా, లేదా ఏదైనా వ్యక్తిత్వ వికాస పుస్తకములు చదివినా అందులో చెప్పే విషయం ఒక్కటే నీ కర్తవ్యం నువ్వు మాత్రమే నిర్వహించాలి, దాని ఫలితం గురుంచి ఆలోచించకు ఎందుకంటే అది మిగితా వారి పని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో ఏది వ్యర్ధం మాత్రం కాదు. 

ఉదాహరణకు మీరు ఒక పరీక్ష రాయడానికి వెళ్తున్నారు అనుకుందాం, నా జాతకం బాగుంది. దేవుడికి పూజ చేశాను కాబట్టి నేను చదవకర్లేదు అనుకుని వెళ్తే మీరు ఏమి చేయలేరు. అదే మీ కష్టం మీరు పడి వెళ్లారు అనుకోండి ఎంతోకొంత మీరు రాయగలుగుతారు. మీ కష్టానికి దైవానుగ్రహమో లేక అదృష్టమో కలిసివస్తుంది. అంతేగాని కష్టమే లేనిచోట ఏమి కలిసి వస్తుంది? ఇక్కడ వరకు మనం కష్టపడటం గురుంచి చెప్పుకున్నాము ఇప్పుడు ఫలితాలు గురుంచి ఆలోచిద్దాం. మనం చాలా కష్టపడి చదివాము, కాబట్టి మొదటి ర్యాంకు మనకే రావాలి అనడం అవివేకం. ఎందుకంటే మనతో పాటు పరీక్షలో పాల్గొన్న అందరూ ఎంతోకొంత కష్టపడే ఉంటారు. అందరిలోని ఎక్కువ ఎవరైతే తమ కలలు సాకారం చేసుకోడానికి కష్టపడ్డారో ఫలితం వారినే వరిస్తుంది. అలా అని మీరు నేర్చుకున్న విద్య ఎప్పటికి వృధాగా పోదు. తరువాత సారి అయినా ఉపయోగపడుతుంది. అందుకే మీ కర్తవ్యం మీరు నిర్వహించండి. ఫలితం గురుంచి ఆలోచించకండి. మీ కర్మకి వేరొకరిని బాధ్యులను చేయకండి.


విగ్రహారాదన అవివేకం అని చాలా మంది అంటూ ఉంటారు, అదే సైన్సు గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ గురుంచి వివరిస్తుంది. మరి దానిని ఏ విధంగా చూస్తాం. నిజంగా సైన్సు ప్రకారం గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నదీ నిజమైతే మరి దాని గురుంచి గుడికి వెళ్ళడం తప్పు కాదు కదా? అలాగే మంత్రాల ఉచ్చరణలో వచ్చే ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా మారి మంచి చేస్తుందని తెలియవచ్చింది. అలాంటప్పుడు అలాంటి అలవాట్లను వదులుకోవడం ఎందుకు? కాని అదే జీవితం అయిపోకుడదు. భగవద్గీతలో కూడా చెప్పేది ఒక్కటే నువ్వు ఈ జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం నీ కర్తవ్యం అది నువ్వే నెరవేర్చాలి. అది నెరవేరుస్తూ దైవ నామస్మరనో లేదా మీకు నచ్చిన మంచి పనులో చేసుకోవచ్చు. కాని కేవలం అవి మాత్రమే చేయకూడదు.


జనన మరణాలు దైవాదీనం లేదా మన చేతిలో లేనివి. ఎప్పుడు పుడతామో, ఎప్పుడు పోతామో మనకి తెలియదు, నడుమన ఉన్న పయనం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఆ పయనం ఎంత అందంగా మలుచుకుంటావో అది నీ మీదే అదారపడుతుంది. "అదృష్టం చెప్పి రాదు సమయం చెప్పి పోదు" కాబట్టి చెప్పి రాని అదృష్టం గురుంచి ఆలోచించకుండా ఉన్న సమయం వాడుకోవాలి.


ఇంకా దైవాన్ని ఎలా చూడగలం అని అడుగుతారు. మండు వేసవిలో భగభగ మండిపోతున్న సూర్యుడు వలన నడిరోడ్డు మీద దాహంతో నువ్వు ఆగిపోయినప్పుడు మరికొన్ని క్షణాలు ఉంటే వడదెబ్బ తీవ్రంగా తగిలి ప్రాణాలే పోతాయి అనగా అటువైపు వెళ్ళే ఒక బాటసారి మీకు కాసిన్ని నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఒక నీడకి చేర్చాడు అనుకోండి అతనే దేవుడు. అవును దేవుడు అంటే సినిమాలలో చూపించినట్టు కాంతులతోను, మెరుపులతోను వచ్చి కనిపించరు. మనలోనే, మనతోనే ఉంటాడు. దానినే మానవత్వం అంటారు. మానవత్వం మాత్రమే మనిషి మనుగడకి మార్గము, అది నశించిన రోజున ఈ సృష్టి నశిస్తుంది (ఇప్పటికే చాలా యుద్దాలు, వైరస్ తదితర మానవత్వం లేకనే వచ్చుచున్నవి) అందుకే మానవత్వమే దైవత్వం. నీకు సహాయం చేయగలిగినంత నువ్వు చెయ్యి. అది మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, వస్తు, అన్న, మరి ఏ ఇతర సహాయమైన అయ్యి ఉండొచ్చు కాని సహాయం చెయ్యి. నీ దగ్గర సహాయం అందుకున్న వారిని వేరే వారికి కూడా వాళ్ళకి తోచినది చేయమని చెప్పు. అదే మన అందరిలో దైవత్వాన్ని నిద్రలేపుతుంది. ఈ జగతని ఉన్నతంగా మారుస్తుంది.


ఇక్కడ ఇది అప్రస్తుతం అయినా దానం గురుంచి వచ్చింది కాబట్టి కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. మనం కుడి చేతితో చేసే దానం మన ఎడమ చేతికి తెలియకూడదు అంటారు మన పెద్దలు.కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బాధితులకు సహాయం చేస్తూ ఫొటోస్ పెడుతున్నారు. పబ్లిసిటీ కొరకై సహాయం చేయొద్దు. మనసావాచా చేయాలి అనిపిస్తేనే చేయండి. కొంతమంది దీనికో సమాధానం చెప్తున్నారు. మేము చేస్తున్నట్లు తెలిస్తే ఇంకో పది మంది ప్రేరణ పొంది వాళ్ళు కూడా సహాయం చేస్తారు కదా అని. నిజమే అలా ప్రేరణ పొందుతారు అనుకుందాం నువ్వు చేస్తున్న పని గురుంచి చెప్తే చాలు కదా ప్రేరణ పొందడానికి ఎందుకు ఆ బాధితుల ఫోటోలు బహిర్గతం చేయడం. ఏ మనిషికి చెయ్యి చాచి దేహి అని అడగాలి అనిపించదు. వాళ్ళకి గతిలేక మీ సహాయం తీసుకుంటున్నారు. వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నా అభిప్రాయం.


ఇంక మనం వివరణ ఇచ్చుకుంటున్న విషయానికి వస్తే దైవం, జీవితం గురుంచి అందరికి ఆమోదయోగ్యమైన రీతిగా మన వివరణ సాగింది అనుకుంటున్నాను. ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, తప్పుగా మాట్లాడినా అన్యదా భవించవద్దు అని కోరుకుంటూ 

- ✍️మీ సత్యనారాయణ రెడ్డి.

Comments

Post a Comment